లగ్నాలకు యోగకారక గ్రహాలు, ఆధిపత్యం వలన శుభ పాప గ్రహాలు


లగ్నాలకు యోగకారక గ్రహాలు ఆధిపత్యం వలన శుభ పాప గ్రహాలు

          లగ్నము నుండి 1, 4, 7, 10 స్థానములను కేంద్రములని; 1, 5, 9 స్థానములను కోణములని అందురు.  కేంద్ర స్థానములను విష్ణు స్థానములని, కోణ స్థానములను లక్ష్మీ స్థానములని చెప్పబడుచున్నవి.  

          ఒక జాతకమున కేంద్ర కోణాధిపత్యములు గ్రహము ఆ జాతక లగ్నమునకు యోగకారక గ్రహమగుచున్నది.  ఉదాహరణకు వృషభ లగ్న జాతకులకు శని యోగకారక గ్రహము.  వృషభము నుండి నవమ కోణాధిపతి, దశమ కేంద్రాధిపతి శని.  అట్లే, తులా లగ్నమునకు చతుర్ధ కేంద్రాధిపతిగా, పంచమ కోణాధిపతిగా శని యోగకారకుడు. అట్లే, కర్కాటక లగ్నమునకు పంచమ కోణాధిపతిగా, దశమ కేంద్రాధిపతిగను మరియు సింహ లగ్నమునకు చతుర్ధ కేంద్రాధిపతిగా, నవమ కోణాధిపతిగను కుజుడు కర్కాటక సింహ లగ్నములకు యోగకారకుడు.  ఇట్లే, మకర కుంభములకు శుక్రుడు యోగకారకుడు.  మకరము నుండి 5, 10 స్థానములు, కుంభము నుండి 4, 9 స్థానములు శుక్రుడు కేంద్రాధిపతిగా గల వృషభ తులా రాశులు.  

          కేంద్రాధిపత్యము శుభ గ్రహములకు పట్టిన అది దోషము.  అందుచే ఆ గ్రహములు పాపులగుదురు.   పాప గ్రహములు కేంద్రాధిపత్యమున శుభులు అగుదురు.  సామాన్యంగా 3, 6, 8, 11 భావాల ఆధిపత్యం కల గ్రహాలు పాపులు.  5, 9 భావాల ఆధిపత్యము గలవారు శుభులు.  లగ్నాధిపతియే 8వ స్థానమునకు అధిపతి అయిన అతడు శుభుడే అగుచున్నాడు.  అష్టమాధిపత్య దోషము రవి చంద్రులకు లేదు.  లగ్నాధిపతి ఎల్లప్పుడును జాతకునకు శుభుడుగా ఉండుటకే ప్రయత్నించును.  ఒక పాప స్థానాధిపత్యము ఒక కోణాధిపత్యము కలిగిన గ్రహము కోణాధిపత్య బలముచే శుభుడే అగుచున్నాడు.