పంచాంగము :
తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలకు పంచాంగము
అని పేరు. ఐదు అంగములు కలది కావున దీనిని “పంచాంగము” అందురు. దీనిలో పై ఐదు అంగాలతో పాటు రవ్యాదుల స్థిత్యాది
విశేషాలున్నాయి. పంచాంగమునందు తిథ్యాదులు ఎన్ని
గంటలవరకు ఉంటాయో ప్రతి దినమునకు వ్రాస్తారు. ఆ దినమునకు చెందిన సూర్యోదయ, సూర్యాస్తమయ
సమయాలు, ఇంగ్లీష్ తేదీలు, శాలివాహక శకం
తేదీలు, ఆ రోజున సంచరించే గ్రహాల పేర్లు ఉంటాయి. తిథి, వార, నక్షత్ర, యోగా, కరణం వరుసగా వ్రాయబడి
ఉంటాయి. ఆయనం, ఋతువు, ఇంగ్లీష్ తేదీల ప్రక్కన ఇంగ్లీష్ నెల, సంవత్సరం వ్రాయబడతాయి. తిథి, నక్షత్రాల తరువాత అవి ఆ దినం ఎంత
వరకు ఉంటాయో ఆ కాలాన్ని వ్రాస్తారు. దుర్ముహూర్త
ప్రారంభ సమయము ఇచ్చి ఎంత కాలము త్యాజ్యమో వ్రాస్తారు. ఆ నెల ప్రారంభములో గ్రహస్థితిని తెలిపే చక్రం ఉంటుంది.
లగ్నాంత కాలములు పగటికి రాత్రికి చెందినవి
ఉంటాయి. సుముహూర్తాలు, గ్రహణాలు, మూఢములు మొదలగునవి సూచించబడతాయి.
తిథులు
:
తిథులు 15. అవి – పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ / అమావాస్య.
తిథులు ఐదు రకాలు. అవి .....
1)
నంద తిథులు .... పాడ్యమి, షష్టి, ఏకాదశి
2)
భద్ర తిథులు ..... విధియ, సప్తమి, ద్వాదశి
3)
జయ తిథులు ... తదియ, అష్టమి, త్రయోదశి
4)
రిక్త తిథులు ..... చవితి, నవమి, చతుర్దశి
5)
పూర్ణ తిథులు ... పంచమి, దశమి, పూర్ణిమ / అమావాస్య
ఇందు రిక్త తిథులు శుభ కార్యములకు పనికిరావు.
ఆంధ్రులు షష్టి, అష్టమి, అమావాస్యలను కూడా అశుభ తిథులుగానే పరిగణించుట
పూర్వాచారము.
వారములు
:
వారములు 7. అవి – ఆదివారము, సోమవారము, మంగలవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము. సూర్యోదయ కాలమున ఏ గ్రహము
యొక్క హోరా ఉండునో, ఆ గ్రహ నామము ఆ దినమునకు పెట్టబడినది. ఇందు మంగలవారము ఉగ్రవారము, శనివారము దారుణవారము.
నక్షత్రములు
:
నక్షత్రములు 27. అవి – అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ (పూర్వ ఫల్గుణి), ఉత్తర (ఉత్తర ఫల్గుణి), హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జేష్ఠ, మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి.
ఉత్తరాషాడ చివరి 4వ పాదం నుండి, శ్రవణ నక్షత్ర కాలమండలి మొదటి నాలుగు
ఘడియల కాలమును “అభిజిత్” నక్షత్రమని వ్యవహరింతురు.
నక్షత్రాలకు అధిదేవతలుగా కొందరిని గుర్తించడం
జరిగినది. ఆయా దేవతలననుసరించి నక్షత్రము యొక్క
శుభాశుభాలు ఆధారపడి ఉంటాయి.
యోగాలు
:
యోగాలు 27. అవి – విష్కుంభమ్, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్య, శోధన, అతిగండ, సుకర్మ, ధృతి, శూల, గండ, వృద్ది, దృవ, వ్యాఘాత, హర్షణ, వజ్ర, సిద్ది, వ్యతీపాత, వరీయన్, పరిఘ, శివ, సిద్ద, సాధ్య, శుభ, శుక్ల, బ్రహ్మ, ఇంద్ర, వైధృతి.
వీటిలో, విష్కుంభ, అతిగండ, శూల, గండ, వ్యాఘాత, వజ్ర, వ్యతీపాత, పరిఘ మరియు వైధృతి అనునవి తొమ్మిది నింధ్యములు.
కరణములు
:
కరణములు 11. అవి – బవ, బాలవ, కౌలవ, తైతుల, గరజి, వణిజ, భద్ర, శకుని, చతుష్పాద, నాగ, కింస్థుజ్ఞ. వీటిలో మొదటి 7 చర కరణాలు, చివరి 4 స్థిర కరణాలు. స్థిర కరణములు
నింధ్యములు.
పంచాంగ
ప్రయోజనములు :
1)
వైదిక కర్మలు చేయవలసిన సరియైన కాలము
తెలుసుకొనుట
2)
రవ్యాధి గ్రహాల స్థితిని తెలుసుకొనుట
3)
సుముహూర్తములను తెలుసుకొనుట
4)
సంవత్సరము, ఆయనము, ఋతువు, మాసము, పక్షము, వారము, తిథి మొదలగు కాలమును తెలుసుకొనుట
5)
సూర్యోదయ, సూర్యాస్తమాన కాలములు తెలుసుకొనుట
6)
పండుగ దినములను తెలుసుకొనుట
7)
వర్జ్య కాలము, దుర్ముహూర్త కాలములను తెలుసుకొనుట
8)
జాతక చక్రములు వేయుటకు
9)
గ్రహణ కాలములు, గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి కాలములు, గోచార ఫలములు
--- మొదలగునవి తెలుసుకొనుట అనునవి పంచాంగము
యొక్క ముఖ్య ప్రయోజనములు.